Daggubati Purandeswari: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మంగళవారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం ప్రజలందరినీ మొక్కలు నాటేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వివిధ అంశాలపై మాట్లాడారు.
Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. ఓరి దేవుడా జర్రుంటే సచ్చి పోయేటోళ్లు..
పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధికి ఓటు వేసి మూడోసారి నరేంద్ర మోడీకి భారత ప్రధానిని గెలిపించుకున్నారని.. దేశాభివృద్ధి పథంలో బీజేపీకి తిరుగులేదని అన్నారు. వికసిత్ భారత్ అంటే అందరినీ అభివృద్ధి దిశగా నడిపించినపుడే సాధ్యమవుతుంది అని పురంధేశ్వరి పేర్కొన్నారు. ధృడమైన నాయకత్వం కావాలని ప్రజలు ఆశించి 2014లో మార్పును తీసుకొచ్చారు. అప్పటినుంచి ప్రధాని మోదీ “సబ్ కే సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్” అనే నినాదంతో దేశాన్ని అవినీతి రహిత పాలనవైపు నడిపించారని ఆమె అన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పేదవారికి మేలు చేసే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. అలాగే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు అనుభవించిన రాక్షస పాలనకు ముగింపు పలికే విధంగా 2024లో ఎన్డీయే కూటమికి అధికారం ఇచ్చారన్నారు. గ్రామీణ అభివృద్ధికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, రాష్ట్రాన్ని కూడా ఆ దిశగా మద్దతు ఇస్తున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు.