Raghurama Krishna Raju: అమరావతి ప్రాంత మహిళలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన మహిళల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
Read Also: Janmabhoomi Express : తెలంగాణలో తప్పిన పెను ప్రమాదం.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ఇంజిన్ బ్రేక్‌డౌన్
ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు అమరావతిలో పలువురు మహిళలు రోడ్డెక్కారు. అయితే వారిపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన, ‘‘పిశాచాలు కూడా ఇలా చేయలేకపోవచ్చు. వారిని రాక్షసులుగా కూడా పిలవలేం. వీరంతా కలసి ఒక రకమైన తెగలా తయారయ్యారు. ఈ తెగ పూనుకుంటేనే ఇలాంటి చర్యలకు పాల్పడగలదు. పూర్తిగా సమన్వయంతో వ్యవస్థీకృతంగా నిరసనలు చేస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు అమరావతి మహిళల హక్కులకు, వారి గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయని రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అభిప్రాయం వ్యక్తం చేయడానికి హక్కు ఉంటుందని, దానిపై ఈ విధమైన వ్యక్తిగత దూషణలు అంగీకరించలేనివని అన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన సజ్జలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన కోరారు. మరి ఈ వివాదంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.