జెండా భుజాన పెట్టుకుని పార్టీని అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే అని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచ్చేశారు. అయితే.. ఈ బహిరంగ సభలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. విద్వేషాలు చిమ్ముతున్న బీజేపీ కి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నారు రాహుల్ అని ఆయన కొనియాడారు. ఇబ్బందులు ఉన్నా.. ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రెండు హామీలు అమలు చేశాం ..త్వరలోనే రెండు హామీలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. బీఆర్‌ఎస్ నేతలు బట్టలిప్పే కొడతా అంటున్నారు కొందరు అని, కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే మీరు తిరగ గలరా అని ఆయన ప్రశ్నించారు. మా తడాఖా ఏందో కూడా చూపిస్తామని, చూస్తూ ఊరుకుంటామా..? అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఆ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండింటిని అమలు చేశామని మల్లు భట్టి తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.