కార్తిక మాసాన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అక్టోబర్ 31న ప్రారంభం అయిన కోటి దీపోత్సవ సంరంభం 12వ రోజుకి చేరుకుంది. కోటిదీపోత్సవం-2022 12వ రోజు ఉత్సవంలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి దీపోత్సవం -2022 12వ రోజు ఉత్సవంలో భాగంగా అమ్మవార్ల పల్లకీసేవలు వైభవంగా సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అమ్మవార్ల పల్లకీ సేవలు అలరించాయి. కోటి దీపోత్సవంలో భాగంగా మధురై మీనాక్షి సుందరేశ్వర కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మశ్రీ డా.బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి గారి ప్రవచనామృతం అందరినీ అలరించింది. ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించింది.
Read Also: Pawan Kalyan Meets With PM Modi: ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఏం చర్చించారంటే?
ఇప్పటికే 11 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. 12వ రోజు కార్యక్రమాలు కడువైభవంగా నిర్వహించింది. 12వ రోజు శ్రీ మధుపండిత దాస (హరేకృష్ణ మూమెంట్, బెంగళూరు), శ్రీ సత్య గౌరచంద్ర దాస (హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, హైదరాబాద్) వారిచే అనుగ్రహ భాషణం చేశారు. శక్తిపీఠాలు, దేవీక్షేత్రాల అమ్మవార్లకు కోటి కంకుమార్చన చేశారు. భక్తులచే లక్ష్మీ విగ్రహాలకు కోటి కుంకుమార్చన చేశారు. మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణోత్సవం తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో కోటి దీపోత్సవం ప్రాంగణం కిక్కిరిసింది.
మధురై శ్రీ మీనాక్షి అమ్మవారి కోసం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ గజమాలను తీసుకువచ్చారు. ఆ గజమాలను ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్రచౌదరి అలంకరించారు. అమ్మవారి ఆశీర్వాదాన్ని పండితులు అందచేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి సతీమణి రమాదేవి, నరేంద్ర చౌదరి కుమార్తె రచనా చౌదరి అమ్మవార్లకు తాంబూలాలు అందచేశారు. పరిణయ శోభతో మీనాక్షి సుందరేశులు వెలిగిపోయారు. భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని ప్రశంసించారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. వేదికపై అతిథులు తొలి కార్తిక దీపారాధన కావించారు. అనంతరం భక్తులు తమ తమ స్థానాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటి దీపోత్సవానికి అందరికీ ఇదే మా స్వాగతం.