ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు శనివారం ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కే అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమైందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్ చేర్చడం అతడికి కలిసి రానుంది. దీనిపై మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటన రానుంది.
ఆస్ట్రేలియా పర్యటనలో వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా రేసులో ఉన్నా.. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని సమాచారం. దీర్ఘకాలిక ఫిట్‌నెస్, పనిభారం నిర్వహణపై బీసీసీఐ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు శుభ్‌మన్ గిల్‌కు అనుకూలంగా మారాయి. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ టీమిండియా భవిష్యత్ కారణంగా సెలెక్టర్లు రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పంత్ భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు.
Also Read: Akhanda 2 vs OG: గెట్ రెడీ.. అఖండ తాండవం కాదు, ఓజీ ఊచకోత?
రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. ఐపీఎల్ 2025లో పరుగుల వరద పారిస్తున సాయి సుదర్శన్ టాప్ మూడో స్థానంలో ఆడనున్నాడు. నాలుగో స్థానంలో గిల్ ఆడనుండగా.. ఆపై శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధ్రువ్ జురెల్‌ను రిజర్వ్‌గా కొనసాగించనున్నారు. రవీంద్ర జడేజా భారత స్పిన్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులో ఉండవచ్చు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పక్కా. మహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఇద్దరు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.