మిడ్ మానేరు ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలు, బీజేపీ నేతల అక్రమ అరెస్ట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల బాధితులపైనా పోలీసుల లాఠీఛార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమని, మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం భూములను, ఆస్తులను త్యాగం చేసిన బాధితులని కూడా చూడకుండా అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరపడ్డాయని ఆయన ధ్వజమెత్తారు.
అంతేకాకుండా.. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తే ఆందోళన చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని ఆయన హితవు పలికారు. మిడ్ మానేరు బాధితుల డిమాండ్లన్నీ న్యాయబద్దమైనవే…వారికి బీజేపీ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిడ్ మానేరు బాధితుల డిమాండ్లను తక్షణమే తీర్చాలని, తక్షణమే అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు బండి సంజయ్.