ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సరూర్నగర్ స్టేడియంలో మన నగరం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ జీఓ 118 విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఎల్బీ నగర్ లో ఏళ్ళ తరబడి పెండింగులో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బండి సంజయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇది బీజేపీ విజయం. బాధితుల విజయమని ఆయన వ్యాఖ్యానించారు. 8 ఏండ్లుగా అక్కడి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, ఎన్నో పోరాటాలు చేశారని, వారికి బీజేపీ అండగా నిలిచిందన్నారు.
Also Read : Extramarital Affair: ప్రియుడి మోజులో భర్తని చంపించింది.. 24 గంటల్లోనే బుక్కైంది
నా పాదయాత్ర సమయంలోనూ వారికి సంఘీభావం తెలిపానని, అయినా పట్టించుకోకపోవడంతో ఎంతోమంది చిరు ఉద్యోగాలు చేసుకునే సామాన్యులు అప్పులపాలై అతి తక్కువ ధరకు టీఆర్‌ఎస్ నేతలకు ఇండ్లు అమ్ముకున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్ ఈరోజు జీవో జారీ చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బైపోల్ లో టీఆర్ఎస్ ఓటమి భయంతో ఈ జీవో ఇష్యూ చేశారని ఆయన అన్నారు. ఇంకా కుంటి సాకులు చెప్పకుండా వెంటనే జీవోను అమలు చేయాలన్నారు. ఎన్నికల తరువాత పెండింగ్ లో పెడితే కేసీఆర్ సర్కారు అంతు చూస్తామని, మహోద్యమం చేస్తామన్నారు. ఇండ్ల రిజిస్ట్రేషన్ల సమస్యకు పూర్తి పరిష్కారం దొరికే వరకు బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.