Woman Killed Her Husband With Help Of Boyfriend: పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత.. తన భర్త అడ్డు తొలగించేందుకు మరణ శాసనం రాసింది. ప్రియుడితోనే భర్తను హత్య చేయించింది. ఆపై ఏమీ ఎరుగనట్టుగా డ్రామాలు ఆడింది. అయితే.. ఆ డ్రామా తేడా కొట్టడంతో, అడ్డంగా దొరికిపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న అప్పారావు, విశాఖ నగరం వియ్యపు వానిపాలెంలో తన భార్య ఉమ, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అప్పారావు.. తాను సంపాదించిన మొత్తాన్ని తాగుడుకే పెట్టేవాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో.. భార్య ఉమ పనిలో చేరింది. ఈ క్రమంలోనే ఆమెకు సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న వెంకటరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అటు.. అప్పారావుతోనూ స్నేహం కుదరడంతో, వారి ఇంటికి వెంకటరెడ్డి వచ్చి వెళ్తుండేవాడు.
కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత భర్త అప్పారావు తనని రోజూ వేధిస్తున్నాడని, అతనితో ఇక ఉండలేనని వెంకటరెడ్డికి ఉమ చెప్పింది. దాంతో.. అప్పారావుని చంపాలని స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం.. శనివారం ఒక పని పడిందని చెప్పి, అప్పారావుని వెంకటరెడ్డి తనతోపాటు తీసుకెళ్లాడు. వీరితో పాటు మరో సెక్యూరిటీ గార్డు సింహాచలం కూడా ఉన్నాడు. ఒక బార్‌లో మద్యం సేవించిన తర్వాత.. గాజువాక 80 ఫీట్ రోడ్‌లోని వికేఆర్ టవర్స్‌కు ముగ్గురు వెళ్లారు. అక్కడే సెల్లార్‌లో ఒక కిటికీ చెక్కతో అప్పారావు తలపై వెంకటరెడ్డి మూడుసార్లు బలంగా మోదాడు. ఆ దెబ్బలకు అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం సహకారంతో స్కూటర్‌పై అప్పారావు మృతదేహాన్ని ఒక సర్వీస్ రోడ్డు వద్ద పడేసి వెళ్లిపోయారు. ఈ జరిగిన విషయాలన్నింటినీ ఉమకి ఫోన్‌లో చేరవేశాడు వెంకటరెడ్డి. పని పూర్తయ్యిందని, అప్పారావు చనిపోయాడని మెసేజ్ పెట్టాడు.
ఆదివారం ఉదయం ఆ మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పారావు భార్య ఉమ కూడా అక్కడికి చేరుకొని, ‘బంగారం లాంటి తన భర్తను ఎవరో చంపేశారే’ అంటూ బోరున విలపించింది. అప్పుడే ఉమ వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా.. ఆమె సెల్‌ఫోన్ కాల్ డేటాని పరిశీలించారు. వెంకట్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఉందని తేలడంతో.. అతనితో పాటు ఉమని తమదైన శైలిలో విచారించారు. తమ వివాహేతర సంబంధం కోసమే అప్పారావుని చంపేశామని నేరం అంగీకరించారు. ఆ ఇద్దరితో పాటు సింహాచలంని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసుని చేధించారు.