కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో పర్యటిస్తూ భారత్ ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. ‘‘మిస్టర్ రాహుల్ గాంధీ… క్విట్ ఇండియా’’ అని నినదించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పిన బండి సంజయ్… అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి జీహెచ్ఎంసీపై కాషాయ జెండాను ఎగరేసి తీరుతామని, మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తడనుకున్న. కానీ రేవంత్ తో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కు కాంగ్రెస్ లో ఎవరిని పట్టుకుంటే పనైతదో తెలుసు. అందుకే ఢిల్లీ పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిండు… అందుకే కేసీఆర్ కుటుంబం జోలికి రేవంత్ రెడ్డి వెళ్లడం లేదు. అదే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కుటుంబం అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డిని ఎట్లా గుంజుకుపోయి జైల్లో వేశారో… అట్లనే కేసీఆర్ కుటుంబాన్ని గుంజుకుపోయి జైల్లో వేసేటోళ్లం. ఎందుకంటే కేసీఆర్ అన్ని అరాచకాలు చేసిండు.’’అని పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి ఎస్సార్ కన్వెన్షన్ హాలులో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కూన రవి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
సభ్యత్వ నమోదు విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. ఇన్సూరెన్స్, ఇతర తాయిలాల ఆశ చూపకుండా సభ్యత్వ నమోదు చేయిస్తున్న పార్టీ బీజేపీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ డివిజన్ లో అత్యధికంగా సభ్యత్వాన్ని నమోదు చేస్తారో… ఆ డివిజన్ లోని బీజేపీ నాయకులందరినీ ఘనంగా సన్మానిస్తాం.
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. అంతకుముందు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు వంద శాతం మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యం. ఎంఐఎం గోడదూకే పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఒక్కటై పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదే. జీహెచ్ఎంసీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఒవైసీ ఒక్కటై పోటీ చేసినా బీజేపీ ఎదుర్కొవడంతోపాటు గెలిచి తీరుతాం. జీహెచ్ఎంసీ ఎవడి అయ్య జాగీరు కాదు. ఎంఐఎం పార్టీ ఆనవాళ్లు లేకుండా చేస్తాం. తెలంగాణలో ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం.
బీజేపీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలంటే…. బీజేపీ సభ్యత్వమే ఎందుకు తీసుకోవాలి? ఇతర పార్టీలకు, బీజేపీకి ఉన్న తేడా ఏందో తెలుసా? కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా దేశంలోని పార్టీలన్నీ కుటుంబ, వారసత్వ పార్టీలు. అవినీతి పార్టీలు. రాష్ట్రానికి, ప్రాంతాలకే పరిమితమైన పార్టీలు. అవకాశవాద రాజకీయ పార్టీలు….కమ్యూనిస్టు పార్టీలకు క్యాడర్ పార్టీ.. కానీ ఓటర్లు లేని పార్టీ.
కానీ బీజేపీ భిన్నమైన పార్టీ… దేశం కోసం పనిచేసే జాతీయవాద భావాలున్న పార్టీ. దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ. కార్యకర్తల త్యాగాలు, పునాదులపై ఏర్పడ్డ పార్టీ. అట్టడుగునున్న పేదవాడికి సైతం ప్రభుత్వ ఫలాలు అందించాలని ‘అంత్యోదయ’ సిద్దాంతంతో పనిచేస్తున్న పార్టీ. సామాన్య కార్యకర్తను కూడా ప్రధానమంత్రిని, కేంద్ర, రాష్ట్ర మంత్రులను, రాష్ట్ర, జాతీయ అధ్యక్షులను చేసిన పార్టీ. 25 కోట్ల మందికి పేదరికం నుండి విముక్తి కలిగించిన పార్టీ. దేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని దీన్ దయాళ్ ఆశిస్తే… అమలు చేసిన ప్రధాని వాజ్ పేయి. 370 ఆర్టికల్ రద్దు కోసం శ్యామాప్రసాద్ బలిదానం చేస్తే… ఆ స్పూర్తితో 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీ. మహిళలకు సమాన హక్కులు, వేతనాలివ్వాలని పార్లమెంట్ లో అంబేద్కర్ అడిగితే…అవమానించిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మహిళలకు చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ బీజేపీ. దేశవిభజనవల్ల ఇతర దేశాల్లో నష్టపోయిన హిందువులందరికీ ఉమ్మడి పౌరస్మ్రుతి కల్పించాలనే ఆశయాన్ని నెరవేర్చిన పార్టీ.
Amit Shah: బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను టచ్ చేయలేరు.. రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్..
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. 2014లో 11 కోట్లు.. 2019లో 7 కోట్లు… కలిపి మొత్తం 18 కోట్ల మంది సభ్యులున్న అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ బీజేపీ. చైనాలోని నియంత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని అధిగమించి రికార్డు స్రుష్టించిన పార్టీ బీజేపీ. ఈసారి దేశవ్యాప్తంగా అదనంగా 10 కోట్ల మందితో సభ్యత్వం నమోదు చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నం. తెలంగాణలో 50 లక్షల మంది సభ్యత్వం టార్గెట్… పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి బీజేపీకి పడ్డ ఓట్లు 77 లక్షలకుపైనే. ఈ ఓటర్లందరినీ బీజేపీ మద్దతుదారులుగా చేర్చాలి. అందుకోసం మీరంతా గడప గడపకూ తిరగాలి. ఈ మద్దతుదారులందరినీ సభ్యులుగా మార్చాలి. ఆ సభ్యులే రేపు కార్యకర్తలుగా, నాయకులుగా తీర్చదిద్దడమే లక్ష్యం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వేయాల్సిన ఓట్లు పొరపాటున కాంగ్రెస్ కు వేశారు. ఎందుకంటే పోరాటాలు చేసింది బీజేపీ… పొరపాటున చెయ్యి గుర్తుకు ఓట్లేస్తే అది నేడు భస్మాసుర హస్తమైందని బాధపడుతున్నరు. అదే పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే… ఆ పువ్వు వికసించేదని అనుకుంటున్నరు. ఇగ కేసీఆర్ అరాచక పాలన సంగతి చెప్పనక్కర్లేదు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి, రౌడీషీట్లు పెట్టి వేధించిండు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తడనుకున్న. కానీ రేవంత్ తో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కు కాంగ్రెస్ లో ఎవరిని పట్టుకుంటే పనైతదో. అందుకే ఢిల్లీ పోయి మాట్లాడుకుని వచ్చిండు… అందుకే కేసీఆర్ కుటుంబం జోలికి రేవంత్ రెడ్డి వెళ్లడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కుటుంబం అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డిని ఎట్లా గుంజుకుపోయి జైల్లో వేశారో… అట్లనే కేసీఆర్ కుటుంబాన్ని గుంజుకుపోయి జైల్లో వేసేటోళ్లం. ఎందుకంటే కేసీఆర్ అన్ని అరాచకాలు చేసిండు. మా కార్యకర్తలపై కమ్యూనల్ షీట్లు, రౌడీ షీట్లు ఓపెన్ చేసి విపరీతంగా వేధించిండు. నాపై 109 కేసులు పెట్టిండు. ఇప్పటికీ ఆ కేసుల విషయంలో నిరంతరం కోర్టులు చుట్టూ తిరుగుతున్నం.
IC 814 Hijack: ఐసీ 814 విమానంలో ‘రా’ ఏజెంట్.. ఉగ్రవాదులకు తెలిస్తే ఖచ్చితంగా తలనరికే వారు..
రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజా వ్యతిరేక మూటకట్టుకున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తిసిన పార్టీ. మహిళలకు తులం బంగారం, నెలనెలా రూ.2500లు, స్కూటీ ఇస్తానన్నరు. నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్నరు. వ్రుద్దులకు ఆసరా పెన్షన్లు ఇస్తామన్నరు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. ఈ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తుంటే… చర్చను పక్కదారి పట్టించేందుకే రుణమాఫీ సర్వే పేరుతో సాగదీస్తున్నరు. హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతున్నరు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కాంప్రమేజ్ పొలిటిక్స్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ పేరుతో కాంగ్రెస్ సాగదీస్తూ ఆ కుటుంబాన్ని కాపాడుతుంటే…. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ నేతలు 6 గ్యారంటీలపై నిలదీయకుండా విగ్రహాల లొల్లి, ఇతర అంశాలపై రాజకీయం చేస్తున్నరు
శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అంబేద్కర్ స్పూర్తితో బీజేపీ ముందుకుపోతూ ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు అహర్నిశలు క్రుషి చేస్తుంటే… .రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు పోయి భారత్ పరువు తీస్తున్నడు. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి ‘భారత్ లో ప్రజాస్వామ్యంలో ఉంది. విదేశాలు జోక్యం చేసుకోవాలన్నడు. నిన్న అమెరికాలో ‘భారత ఎన్నికల సంఘం మోదీ చేతిలో ఉంది. సరిగా పనిచేయడం లేదు. ఇయాళ ‘రిజర్వేషన్లను రద్దు చేస్తాం’అని విదేశీ గడ్డపై అంటున్నడు. నేనడుగుతున్నా…. కాంగ్రెస్ నేతలారా… దీనికి మీరేం సమాధానం చెబుతారు. తక్షణమే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు విధానాలు ఉండటానికి వీల్లేదని బీజేపీ 370 ఆర్టికల్ ను రద్దు చేస్తే…. అందుకు భిన్నంగా పాకిస్తాన్ కు తొత్తుగా ఉన్న నేషనల్ కాన్పరెన్స్ పార్టీతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటు. అందుకే ఈ వేదికగా కోరుతున్నా… ఈ దేశంలోని రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘంపై నమ్మకం లేని రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. అందుకే చెబుతున్నా ‘రాహుల్…క్విట్ ఇండియా’. ఈ దేశంలో ఒకే త్రివర్ణ పతాకం ఎగరాలన్నదే బీజేపీ నినాదం. కాశ్మీర్ లో రెండు జెండాలు ఎగరేయాలనుకునే పార్టీలను తరిమితరిమి కొట్టాలని కోరుతున్నా
లౌకిక వాదం గురించి మాట్లాడే కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల నేతలారా…. జైనూర్ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? ఒక ఆదివాసీ గిరిజన మహిళపై షేక్ మగ్దూం అనే నీచుడు లైంగికదాడి చేసి హత్యాయత్నం చేస్తే నోరెందుకు విప్పడం లేదు? ఈ ఘటనపై ప్రశ్నించిన హిందువులపై దాడులు చేసి అక్రమ
కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైళ్లో పెడితే మీరెందుకు స్పందించడం లేదు? హిందువులపై దాడులు జరుగుతుంటే, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే హిందుత్వం గురించి నేను మాట్లాడితే తప్పా? హిందువుల పండగలపై నిబంధనలు పెడితే నోరు విప్పరు. గణేశ్ మండపాల పెడితే పర్మిషన్ అడుగతరు. కేసులు పెడతరు. ముస్లిం పండుగలకు మాత్రం పర్మిషన్ అవసరం లేదంటరు. ఇట్లా… హిందువులపై జరుగుతున్న అన్యాయాన్ని పశ్నించని వాడు నా ద్రుష్టిలో హిందువే కాదు. అట్లాంటి వాడు నా ద్రుష్టిలో భారతీయుడే కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ హిందువులపైన, పేదలపైన జరుగుతున్న అన్యాయాలపై నిలదీయాలని కోరుతున్నా. ఈ విషయంలో ముందున్న బీజేపీకి మద్దతివ్వాలని వేడుకుంటున్నా.’ అని బండి సంజయ్ అన్నారు.