Balmuri Venkat : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. “చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు” అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక వ్యక్తి చిత్తశుద్ధితో ఉంటే – విచారణకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్ మాత్రం విచారణపై వ్యంగ్యంగా స్పందిస్తూ బిల్డప్‌లు ఇస్తున్నాడని బల్మూర్ మండిపడ్డారు. “తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న కేటీఆర్ అసలు సత్యాన్ని దాచి తనను నిర్దోషిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు” అన్నారు.
Daggubati Purandeswari: పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం!
ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో మంత్రి వర్గ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీకి రూ.55 కోట్లు చెల్లించడమేనేకాదు, ఆర్బీఐని కూడా అంగీకరింపజేయకుండానే నిధులు పంపినందుకు బాధ్యత ఎవరిదన్నది స్పష్టమని వెంకట్ గుర్తుచేశారు. ఇవన్నీ ఎవరూ ఊహించలేదు, చట్టబద్ధ విచారణలో బయటికొచ్చిన విషయాలేనని తెలిపారు. ఇవే విషయాల్లో అసలైన దోషి కేటీఆర్ అని తేల్చారు. “విచారణకు పిలిస్తేనే పైశాచిక ఆనందం పొందుతున్నారని మాట్లాడుతున్న కేటీఆర్‌కు ఒక్క ప్రశ్న – గతంలో రేవంత్ రెడ్డిని, మమ్మల్ని అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినప్పుడు నీవు అనుభవించిన ఆనందం ఏం? అదే పైశాచిక ఆనందం కాదా?” అని బల్మూర్ ఎదురుదెబ్బ ఇచ్చారు. ఇప్పుడు అరెస్టుకు భయపడనంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టడానికే అని అన్నారు. నిజంగా అరెస్ట్ కావాలనుకుంటే, ఆ కోరిక తీరేలా చూస్తామని, విచారణలో అవినీతి బయటపడితే ఒక్కసారి కాదు.. వందసార్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, కేటీఆర్ డ్రామాలు, దొంగ నాటకాలు ఆపాలని సూచించిన వెంకట్, “నీ కుటుంబ సభ్యులే నిన్ను ‘దెయ్యం’ అంటున్నారు. నిన్ను, నీ నాన్నను తెలంగాణ ప్రజలు ఇప్పటికే నేలకేసి కొట్టారు. ఇప్పుడు రాజకీయంగా నీ స్థానం కూడా నశించిపోయింది. వచ్చే ఎన్నికల్లో నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేవు,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.