రెండు రోజుల పాటు సాగనున్న అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం చండీగఢ్‌లో ఆరంభమైంది. ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా మాజీ షాట్‌పుట్ క్రీడాకారుడు, పద్మశ్రీ బహదూర్‌సింగ్ సాగూ ఎన్నికయ్యారు. ఆదిల్ సుమరివాలా స్థానంలో బహదూర్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. పోటీలో మరెవ్వరూ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2029 వరకు ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు. బహదూర్‌సింగ్ 2002 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచారు. 2000, 2004 ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు.
Also Read: India Open 2025: ఇండియా ఓపెన్ బరిలో కొత్త పెళ్లి కూతురు!
భారత్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్లోబల్ జావెలిన్ ఛాంపియన్‌షిప్ జరగబోతోందని ఏఎఫ్‌ఐ వెల్లడించింది. ఈ పోటీల్లో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రాతో పాటు స్టార్ జావెలిన్ ఆటగాళ్లు ఆడబోతున్నారు. ‘వచ్చే సెప్టెంబర్‌లో భారత్‌లో ప్రపంచ స్థాయి జావెలిన్ ఛాంపియన్‌షిప్ జరగబోతోంది. నీరజ్ చోప్రాతో పాటు టాప్-10 ర్యాంకు ప్లేయర్లు టోర్నీలో ఆడబోతున్నారు. 2027 ప్రపంచ రిలేస్, 2028 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్, 2029 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు బిడ్‌లు మొదలయ్యాయి. వీటి నిర్వహణకు భారత్ తన ఆసక్తిని తెలియజేసింది’ అని ఆదిల్ సుమరివాలా తెలిపారు.