ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీ ఢిల్లీ వేదికగా జనవరి 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్, కొత్త పెళ్లి కూతురు పీవీ సింధు పాల్గొననున్నారు. వివాహం తర్వాత సింధు పాల్గొనే తొలి టోర్నీ ఇదే. గతేడాది చివర్లో ఉదయ్‌పూర్‌లో వెంకట దత్త సాయితో సింధు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2025 సీజన్‌ను త్వరగా ఆరంభించేందుకే డిసెంబర్‌లో తాను వివాహం చేసుకున్నానని ఒలింపిక్ విజేత చెప్పారు. టోర్నీ కోసం సింధు ఇప్పటికే భర్తతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.
ఈ టోర్నీలో భారత్ నుంచి భారీ బృందం పాల్గొంటుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్.. మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక బాన్సోద్, అనుపమ ఉపాధ్యాయ, ఆకర్షి కశ్యప్ పాల్గొంటున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్‌శెట్టి జోడీ, సాయి ప్రతీక్-పృథ్వీ జంట బరిలో దిగనుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, మృణ్మయీ దేశ్‌పాండే-ప్రేరణ ఆల్వేకర్, అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో, అశ్విని భట్-శిఖ గౌతమ్, రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా, సాక్షి గహ్లావత్-అపూర్వ గహ్లావత్, మానస రావత్-గాయత్రి రావత్, సానియా సికందర్-రష్మి గణేశ్ జోడీలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.
భారత్ నుంచి మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో, సతీశ్‌కుమార్-ఆద్య వరియత్, రోహన్ కపూర్-రుత్విక శివాని, ఆషిత్ సూర్య-అమృత ప్రముతేష్ బరిలో దిగుతున్నారు. మొత్తంగా భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ముగ్గురు, మహిళల సింగిల్స్‌లో నలుగురు, పురుషుల డబుల్స్‌లో రెండు జంటలు, మహిళల డబుల్స్‌లో ఎనిమిది జోడీలు, మిక్స్‌డ్‌లో నాలుగు జంటలు బరిలో ఉన్నాయి. ఒలింపిక్ ఛాంపియన్లు విక్టర్ అక్సెల్సెన్, ఆన్ సియంగ్ సహా ప్రపంచ నంబర్‌వన్ షై యుకి కూడా ఇండియా ఓపెన్‌లో బరిలో దిగుతున్నారు. విజేతలకు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించనున్నాయి.