Student Suicide: మొబైల్.. దీనికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రోజుల్లో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితం సెల్‌ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. ఈ క్రమంలోనే పిల్లలపై మొబైల్స్ ప్రభావం ఎంతగా పడిందంటే.. అవి లేకుండా ఉండలేనంతగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం వారికి ఫోన్ ఇస్తే వారు ఇతర అవసరాల కోసం దానిని వినియోగిస్తున్నారు. తద్వారా బంగారు లాంటి భవిష్యత్‌ను పక్కనపెట్టి సెల్‌ఫోన్‌కు బానిసగా మారుతున్నారు. తల్లిదండ్రులు వారిపై సరిగా దృష్టిపెట్టకపోయేసరికి సెల్‌ఫోన్ బానిసలుగా మారుతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రశ్నిస్తే అసహనానికి గురవుతున్నారు. కొందరు క్షణికావేశంలో తమ బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
Read Also: Purandeswari: ఎలన్ మస్క్‌కు ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఆహ్వానం
కర్నూలు జిల్లా ఆదోనిలో ఈశ్వర్ అనే బీటెక్ విద్యార్థి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్లో గేమ్స్ ఆడవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు తమ పిల్లల మీద ప్రేమతో వారు అడిగిన వస్తువులు కొనివ్వడమే కాకుండా.. వాటిని ఎలా, ఎంతమేర వినియోగించాలో నేర్పించాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.