Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్నది అభియోగం. తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, నోటీసులు ఇచ్చి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కుమారుడు రాజేశ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడును పోలీసులు సీఐడీ ఆఫీసుకు తరలించారు. దీంతో సీఐడీ కార్యాలయానికి భారీగా టీడీపీ నేతలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆయనతో పాటు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆఫీసుకు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న అయ్యన్నపాత్రుడు కుటుంబంపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇది బీసీలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
జగన్ హింస విధానంపై ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా తెలుగుదేశం పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మార్క్ దురాగతాలు, దురన్యాయాలు పాసిష్టు పాలనకు నిదర్శనమన్నారు. అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు ఖండించారు. అర్ధరాత్రి అరెస్టులతో సీఐడీ పోలీసులు దొంగలు మాదిరిగా వ్యవహారిస్తున్నారంటూ మండిపడ్డారు. తాను జైలు పక్షి కాబట్టి అందరూ జైలుకు వెళ్లాలనేది జగన్ రాక్షస ఆనందంగా అభివర్ణించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిపై సీఐడీను అస్త్రంగా వాడుతున్నారు. ఏపీలో అసలు ప్రజా స్వామ్యమనేది లేదని ఆనందబాబు అన్నారు.
Read Also: Tirumala : తిరుమలలో కారు కలకలం.. పోలీసులు ఛేజింగ్.. కారు వదిలి లోయలో దూకిన యువకులు
గోడ నిర్మాణం అంశంపై అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్టు చేయటం చట్ట విరుద్ధమని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత నేత యనమల అన్నారు. మున్సిపల్ శాఖకు చెందిన సివిల్ అంశంలో సీఐడీ జోక్యమేంటి..? కోర్టులో పరిష్కరించుకునే సివిల్ అంశాలను పోలీసులు తమ పరిధిలోకి తీసుకుని ఎలా అరెస్టులకు దిగుతారు..? అంటూ ప్రశ్నించారు. అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో టీడీపీ నేతల్ని జగన్ రెడ్డి వేధిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. బీసీ నేతలైన అయ్యన్న, రాజేష్ అక్రమ అరెస్టును ఆయన ఖండించారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్, అందుకు సహకరిస్తున్న పోలీసులు ముందు రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదంటూ బోండ ఉమా జోస్యం చెప్పారు. ఇది ఇలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతిని ఫోన్లో పరామర్శించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.