ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి జనాలకు ఓ హామీ ఇచ్చారు. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు. దశల వారీగా మిమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు. మా ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని ప్రకటించాం’’ అని వెల్లడించారు.
Read Also: Mangalavaram: జీరో ఎక్స్‌పోజింగ్.. ట్విస్టులకు దిమ్మతిరుగుతుంది
తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే అడిగేవారని.. ఆయనకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా.. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అని అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో తమ కుమారులను సీఎం చేయాలని ప్లాన్లు వేస్తున్నారని ఆరోపించారు. ఇక, సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలని చూస్తున్నారన్నారు. తమ కొడుకులు, కుమార్తెల కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలకు ఎలా సేవ చేస్తారు?’’ అని అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read Also: Akkineni Venkat: ఆస్తి పంపకాలు.. నాగార్జునతో గొడవలు.. అన్న వెంకట్ ఏమన్నాడంటే..?
ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ గత వారం మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ మేనిఫేస్టోలో రూ.450కే గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాల ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య వంటివి ఉన్నాయి. ఈనెల 17న మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో అక్కడ ప్రచారానికి తెర పడనుంది.