AVS Birthday Special: ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ అంతగా తెలియదు కానీ, ఏవీయస్ అనగానే చప్పున జనం ‘తుత్తి ఏవీయస్’ అనేస్తారు. బాపు తెరకెక్కించిన ‘మిస్టర్ పెళ్ళాం’లో ‘తుత్తి’ అంటూ ఏవీయస్ పంచిన వినోదం ఈ నాటికీ ఆ సినిమాచూసిన జనానికి కితకితలు పెడుతూనే ఉంది. ఆ తరువాత చిత్రసీమలో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగారు ఏవీయస్. హాస్యనటునిగా, రచయితగా, గీత రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఏవీయస్ పయనం సాగించారు. అయితే, ఏవీయస్ అనగానే ఆయన పంచిన నవ్వులే ముందుగా గుర్తుకు వస్తాయి.
ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం 1957 జనవరి 2న తెనాలిలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ సాహిత్యాభిలాషి. అలా పలు రచనలు చదువుతూ తనలోని రచయితను పదను పెట్టుకున్నారు. తరుఆత నాటకాలు రాస్తూ తనలోని నటుణ్ణి నిద్రలేపారు. ఉదరపోషణార్థం ముందుగా పెన్నుపట్టి పాత్రికేయ వృత్తిలో సాగారు. తరువాత అవకాశం చిక్కినపుడల్లా నటించేవారు. సినిమా రంగంవైపూ పలుమార్లు అడుగులు వేశారు. బాపును ఆకట్టుకోగలిగారు. దాంతో బాపు తెరకెక్కించిన ‘మిస్టర్ పెళ్ళాం’ లో గోపాలంగా నటించి ఆకట్టుకున్నారు ఏవీయస్. అదే బాపు రూపొందించిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ లోనూ ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తరువాత ఏవీయస్ మరి వెనుదిరిగి చూసుకోలేదు. బాపు సినిమాలతో పేరు లభించడంతో ఏవీయస్ ‘బాపు బొమ్మ’గా నిలచిపోయారు.
ఇ.వి.వి. సత్యనారాయణ, ఆయనతో పోటీగా చిత్రాలు రూపొందించిన మరో వినోదభరిత చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇద్దరూ ఏవీయస్ కు మంచి పాత్రలు ఇచ్చి ముందుకు నడిపారు. ఇక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకుల చిత్రాలలోనూ ఏవీయస్ నవ్వులు పూయించారు. తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపించారు ఏవీయస్. స్వతహాగా రచయిత కాబట్టి, కొన్ని పాత్రలను తానే సృష్టించుకొని నిర్మాతదర్శకులకు పని తగ్గించేవారు. దాంతో మరికొన్ని అవకాశాలూ ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా అన్నిటీకీ ‘ఎస్’ అంటూనే ప్రతీసారి పకపకలు పలికించారు ఏవీయస్.
ఏవీయస్ లో రచయిత, దర్శకుడు ఉన్నారని పసికట్టి ప్రోత్సహించారు డి.రామానాయుడు. తాను నిర్మించిన ‘సూపర్ హీరోస్’ చిత్రం ద్వారా ఏవీయస్ ను దర్శకుణ్ణి చేశారు నాయుడు. ఆ తరువాత ఏవీయస్ “ఓరి నీ ప్రేమ బంగారం కానూ, రూమ్మేట్స్, కోతి మూక” చిత్రాలకూ దర్శకత్వం వహించారు. ‘ఓరి నీ ప్రేమ బంగారం’, అంతకు ముందు ‘అంకుల్’ కు ఆయన నిర్మాతగానూ వ్యవహరించారు.
Vaikuntha Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి సందర్భంగా “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” ప్రత్యేక ప్రదర్శన
చిత్రసీమలో ఏవీయస్ అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. సినిమా రంగంలో జూనియర్ ఆర్టిస్ట్ మొదలు టాప్ స్టార్స్ దాకా ఏవీయస్ కు సన్నిహితులే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు కార్యదర్శిగా ఏవీయస్ అందించిన సేవల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇక చిత్రసీమలో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలంటే, ఏవీయస్ ముందుండేవారు. “అందరినీ అలరించడంలోనే నాకు ఓ తుత్తి ఉంది” అంటూ నవ్వించే ఏవీయస్, ఇప్పటికీ ‘అందరివాడు’ అనిపించుకుంటూనే ఉన్నారు.