వయనాడ్ తర్వాత రాయ్‌బరేలీ స్థానానికి రాహుల్ గాంధీ శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో ఓటమి భయంతో సురక్షితమైన సీటు కోసం వెతుకుతున్నారు.. భయపడకు, పారిపోకు అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎదురుదాడికి దిగారు. బీజేపీ ఐకాన్ లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా రెండు స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారనే విషయాన్ని గుర్తు చేశారు.
Read Also: BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..
కాగా, 2014లో కూడా నరేంద్ర మోడీ రెండు స్థానాల్లో పోటీ చేశారని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. వారణాసితో పాటు వడోదర స్థానం నుంచి కూడా ఎన్నికల బరిలో దిగినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆలోచించకుండా పిచ్చి మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారని ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రధాని తన గౌరవాన్ని కూడా పట్టించుకోవడం లేదు.. చిన్నవిషయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇక, రాహుల్ గాంధీ 15 ఏళ్లుగా అమేథీ నుంచి ఎంపీగా కొనసాగారు. కానీ, 2019లో స్మృతి ఇరానీపై 55000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈసారి అమేథీ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీ లాల్ శర్మను బరిలోకి దింపారు. కాగా, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌తో తలపడుతున్నారు.