Amit Shah Fake Video: లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.. ఇప్పటికే.. రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.. ఈ సమయంలో రిజర్వేషన్ల విషయంలో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తు్న్న ఓ వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి శ్అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోకు సంబంధించి రీతోమ్ సింగ్ అనే వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టులో పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను అంతం చేయడం గురించి అమిత్ షా మాట్లాడుతున్నట్లు చూపుతున్న ఫేక్ వీడియోను ప్రచారం చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. ఈ కేసులో ఇదే మొదటి అరెస్ట్ కావడం గమనార్హం. కల్పిత వీడియో చూపుతున్న దానికి భిన్నంగా, హోం మంత్రి చేసిన అసలు వ్యాఖ్యలు తెలంగాణలో ముస్లింలకు “రాజ్యాంగ విరుద్ధ” రిజర్వేషన్‌ను తొలగించాలని సూచిస్తున్నాయని పార్టీ నొక్కి చెప్పింది.
Read Also: Amit Shah: హెలికాప్టర్ లోపం.. అమిత్ షాకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..
కాగా, ఈ కేసుకు సంబంధించి మే 1న విచారణలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు కోరారు. దీనికి సంబంధించి వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఐదుగురు సభ్యులకు నోటీసులు జారీ చేశారు. మన్నె సతీష్, నవీన్, శివశంకర్, అస్మా తస్లీమ్, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేసినట్లు తెలిసింది. నకిలీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌తో రేవంత్ రెడ్డిని పోలీసుల ముందు హాజరుకావాలని కోరినట్లు సమాచారం.
కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన ప్రధాని మోడీ
డీప్‌ఫేక్ వీడియోల ప్రచారం, సర్క్యులేషన్‌ను అరికట్టడానికి ఉద్దేశించిన ఒక కఠినమైన సందేశంలో.. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మహారాష్ట్రలో తన రెండవ ర్యాలీలో ప్రసంగిస్తూ, ఫేక్ వీడియోలను ప్రోత్సహించేవారిని బహిర్గతం చేయడంలో సహాయం చేయాలని ప్రజలను కోరారు. “ఈ వీడియోలను ఫార్వార్డ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి” అని సతారాలో జరిగిన సభలో ప్రధాని మోడీ అన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. నేరస్థులపై కఠినచర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోడీ కోరారు.