Asian Athletics Championships 2025: 26వ ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ 24 పతకాలతో విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించింది. చివరి రోజున బంగారు పతకాలు రాకపోయినా, భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మెరిశారు. ఇందులో మహిళల 5000 మీటర్ల పరుగు పోటీలో పరుల్ చౌధరీ 15:15.33 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచి తన రెండవ రజతాన్ని గెలుచుకుంది. ఆమె ఇంతకు ముందు 3000మీటర్ల స్టీపుల్ చేజ్ లో కూడా రజతం గెలుచుకుంది.
Read Also: Russia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
అలాగే మెరుగైన ప్రదర్శనతో జావెలిన్ త్రోలో సచిన్ యాదవ్ తన వ్యక్తిగత రికార్డ్ గా 85.16 మీటర్లను సాధించి రజతం గెలుచుకున్నాడు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 86.40 మీటర్లతో స్వర్ణం గెలిచాడు. ఇదే పోటీలో యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత ఉత్తమమైన త్రోగా 82.57 మీటర్లతో ఐదవ స్థానంలో నిలిచాడు. మరోవైపు అబినయ రాజరాజన్, స్నేహా ఎస్‌ఎస్, శ్రబణి నందా, నిత్యా గంధేతో కూడిన రిలే బృందం 43.86 సెకన్లతో సీజన్ బెస్ట్ టైం నమోదు చేసి భారత్ కు రజత పతకాన్ని అందించింది.
ఇంకా చూస్తే ఒడిశాకు చెందిన 21 ఏళ్ల అనిమేష్ కుజుర్ 200మీటర్ల రేసులో 20.32 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పి కాంస్య పతకం గెలిచాడు. ఇది 2015 తర్వాత ఈ విభాగంలో భారత్ కు వచ్చిన మొదటి పతకం. అతని ముందు జపాన్‌కు చెందిన టోవా ఉజావా (20.12 సెకన్లు) స్వర్ణం గెలిచాడు. అలాగే 400మీ. హర్డిల్స్ లో తమిళనాడుకు చెందిన విథ్య రామరాజ్ 56.46 సెకన్ల టైంతో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకుంది. మరో అథ్లెట్ అనూ రాఘవన్ 57.46 సెకన్లతో ఏడవ స్థానంలో నిలిచింది. ఇంకో ఈవెంట్ మహిళల 800మీటర్ల రేసులో పూజా తన వ్యక్తిగత ఉత్తమ టైమ్ 2:01.89 సెకన్లతో కాంస్య పతకాన్ని సాధించింది.
Read Also: Hyderabad: సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..!
ఇక మొత్తంగా భారత బృందం మొత్తం 8 బంగారు, 10 రజత, 6 కాంస్య పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది 27 పతకాలతో ముగించిన భారత్ ఈసారి మాత్రం 24 పతకాలతో ముగించింది. అయితే, ఈసారి బంగారు పతకాల సంఖ్యలో (6 నుండి 8కి) మెరుగుదల సాధించింది. చైనా మొత్తం 32 పతకాలతో (19 బంగారు) అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది.