హైదరాబాద్ సూరారంలో యువకుడి మర్డర్‌ను కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు స్నేహితులేనని పోలీసులు తెలిపారు.
ఈ నెల 30న సూరారం బతుకమ్మ కుంట దగ్గర యువకుడి మృతదేహం లభ్యం అయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో చెరువు కట్ట దగ్గర కారు నిలిపి ఉండటాన్ని పోలీసులు గమినించారు. రక్తపు మడుగులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. ఇక కారు నెంబర్ ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి డానిష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
జగద్గిరిగుట్ట పరిధి శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మహ్మద్ బిలాల్ (32) అదే ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న ముగ్గురు పిల్లల తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బోరబండలో నివాసం ఉంటున్న ఆమె కొడుకు సయ్యద్ డానిష్‌కు విషయం తెలిసి బిలాల్‌తో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. అయినా కూడా వివాహేతర సంబంధం కొనసాగించడంతో చంపేయాలని కక్ష పెంచుకున్నాడు. గురువారం క్యాబ్‌లో డానిష్ జగద్గిరిగుట్టకు వచ్చాడు. బిలాల్, అతని స్నేహితుడు అస్లామ్(28)ను మద్యం తాగుదామని గాజులరామారంలోని చింతల్ చెరువు దగ్గరకు వెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం గొడవకు దిగారు. ఇదే అదునుగా డానిష్ వెంట తెచ్చుకున్న కత్తితో బిలాల్‌పై దాడి చేశాడు. వెంటనే బిలాల్, అస్లామ్ తేరుకుని.. డానిష్ చేతిలోంచి కత్తి లాక్కుకుని.. అదే కత్తితో డానిష్‌పై దాడి చేయగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం నిందితులిద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు.
హత్యకు ఉపయోగించిన కత్తిని, రక్తపు బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. తల్లితో వివాహేతర సంబంధం మానుకోలేదని హత్య చేయాలనుకుంటే… అతడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.