మరికొన్ని గంటల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవనుంది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఏఈతో భారత్ తలపడనుంది. ఆసియా కప్ ప్రారంభం నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో 8 మంది కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. సంజూ శాంసన్‌పై ప్రశ్నకు సూర్య తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.
యూఏఈతో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ముఖ్యంగా కీపర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అని చర్చనీయాంశంగా మారింది. 30 ఏళ్ల శాంసన్ 2024లో మూడు సెంచరీలు బాదాడు. అభిషేక్ శర్మతో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించాడు. అయితే శుభ్‌మాన్ గిల్ ఎంట్రీతో పరిస్థితులు పూర్తిగా మారాయి. జట్టు భవిష్యత్తు దృష్ట్యా యాజమాన్యం గిల్‌ను టోర్నీకి ఎంపిక చేసింది. శాంసన్ ఇటీవలి ప్రదర్శన బాగుంది కానీ.. సెలెక్టర్లు, యాజమాన్యం మాత్రం గిల్‌కే ఓటేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గిల్ ఓపెనర్‌గా వస్తే.. శాంసన్ 6వ స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఆ స్థానంలో జితేష్ శర్మతో గట్టి పోటీ ఎదురుకానుంది.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ టాప్ 5 రికార్డులు.. సెంచరీలు, వికెట్స్, భాగస్వామ్యాలు అన్నీ మనవే!
ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు ఉంటుందో లేదో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ రిపోర్టర్ అడిగాడు. ‘సర్.. ప్లేయింగ్ 11ను మీకు మెసేజ్ చేస్తా’ అని సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘నిజానికి మేము శాంసన్‌ను చాలా బాగా చూసుకుంటున్నాము. మీరు చింతించకండి. రేపు మేము సరైన నిర్ణయం తీసుకుంటాము’ అని సూర్య చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. ఆసియా కప్‌లో భారత్ ఫేవరెట్ కదా అని మరొకరు అడగగా.. ‘ఎవరన్నారు?. నేనైతే ఎక్కడా ఆ మాట వినలేదు. మేం టోర్నీలో పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.