క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని సహచరుల బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో NCB ఉన్నట్టు స్పష్టమవుతోంది.ముంబై సెషన్స్ కోర్టులో నిన్న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగినప్పుడు… అతను బయటకొస్తే సాక్ష్యాలు తారుమారైపోతాయనే ఆందోళన వ్యక్తం చేసింది NCB. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని… అది పూర్తయ్యే వరకూ ఆర్యన్‌ను విడుదల చేయవద్దని NCB కోరింది.
రైడ్ జరిగినప్పుడు ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని NCB చెబుతోంది. కానీ… అతను డ్రగ్స్ తీసుకోడానికి క్రూయిష్ షిప్‌లో జరుగుతున్న రేవ్ పార్టీకి వచ్చాడన్నది NCB వాదన. మరోవైపు… డ్రగ్స్ దొరక్కుండా ఆర్యన్‌ను ఎలా నిందితుడిగా పరిగణిస్తారన్నది అతని తరఫు కోర్టుకు వినిపిస్తున్న వాదన. అలాగే, NCB కస్టడీలోకి తీసుకున్నప్పుడు కూడా తనను ప్రశ్నించలేదని చెబుతున్నాడు ఆర్యన్. అంతేకాదు… డ్రగ్స్ కొనసాడానికి అతని దగ్గర డబ్బులు కూడా లేవు. కేవలం తాను పాల్గొన్న పార్టీలో డ్రగ్స్ సరఫరా జరిగితే దానికి తనను బాధ్యుడ్ని చేయడం సరికాదన్నది ఆర్యన్ వాదన. అయితే, అర్బాజ్ ఖాన్ వద్ద లభించిన డ్రగ్స్… స్నేహితుడు ఆర్యన్ ఖాన్ కోసం తెచ్చినవే అంటోంది NCB. క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగానే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని చెబుతోంది NCB.
ఈ పరిస్థితుల్లో ఆర్యన్ ఖాన్‌తో పాటు ఇతర నిందితుల్ని విడుదల చేయవద్దన్నది NCB వాదన. NCB తీరు చూస్తుంటే… ఆర్యన్, అతని స్నేహితుల జ్యుడీషియల్ కస్టడీని కూడా పొడిగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2న ఆర్యన్ సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మరుసటి రోజు వాళ్ల అరెస్ట్ చూపించారు. ఈ నెల నాల్గున ఆర్యన్‌తో పాటు ఇతర నిందితుల్ని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చడంతో పాటు తమ కష్టడీకి అప్పగించాలని కోరింది NCB. ఈ నెల 11 వరకు కస్టడీ కోరినా… 7వ తారీఖు వరకే NCB కస్టడీకి అనుమతించింది కోర్టు. NCB కస్టడీ ముగిసిన తర్వాత ఆర్యన్ సహా నిందితులందర్నీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్, అతని స్నేహితుడు సహా ఆరుగురు ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అలాగే, మున్‌మున్ దామేచా, నుపుర్‌ను బైకులా మహిళా జైలుకు తరలించారు. మరోవైపు… మేజిస్ట్రేట్ కోర్టులో ఆర్యన్ సహా ఇతర నిందితుల బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగినా… తమ పరిధిలో లేదంటూ అప్లికేషన్‌ను తోసిపుచ్చారు న్యాయమూర్తి. ముంబై సెషన్స్ కోర్టులో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.