Arogya Mahila: తెలంగాణ మహిళామణులకు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కానుకను ప్రకటించింది. మార్చి 8న ‘ఆరోగ్య మహిళ’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు… మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించి రాష్ట్రమంతటా విస్తరించాలని చూస్తున్నట్లు హరీష్ తెలిపారు. మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించి.. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఉన్నతాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు బీఆర్కే భవన్ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 8న ప్రారంభించనున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Gold Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. నలుగురు అరెస్ట్
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలతో పాటు ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, ఔషధాలు అందిస్తారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించనున్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారని మంత్రులు వెల్లడించారు. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే వరకు వైద్య సేవలు అందుతాయన్న మంత్రి హరీష్ రావు.. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఉంటాయన్నారు.