Atchannaidu Mother: ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కింజారపు కళావతమ్మ మృతి చెందారు. కింజారపు కళావతమ్మకు ఏడుగురు సంతానం కాగా.. అందులో ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఎర్రన్నాయుడు, హరివరప్రసాద్, ప్రభాకర్, అచ్చెన్నాయుడు మగ సంతానం. కళావతమ్మ మృతిపట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అచ్చెన్నాయుడి మాతృమూర్తి కళావతమ్మ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్టు వెల్లడించారు. అమ్మగారి మరణం కింజారపు కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కళావతమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు.