Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇటీవల ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం.. రాజధాని అమరావతి జోన్-8 ప్రాంతంలోని 4 గ్రామాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం టెండర్లు ఖరారు చేసింది.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌కు స్వచ్ఛందంగా భూములిచ్చిన గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూములు ఇచ్చిన రైతులు, గ్రామాల ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ప్రారంభించనుంది.
జోన్-8లో 4 గ్రామాలకు భారీ నిధులు కేటాయించింది సర్కార్.. అమరావతి జోన్-8 పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. ఈ గ్రామాల లేఅవుట్‌లలో సమగ్ర మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.1,358 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.. ఈ అభివృద్ధి పనుల L1 బిడ్‌ను ఆమోదించిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక ఆమోదం తెలిపింది. దీంతో, ఈ పనుల కాంట్రాక్ట్‌ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (MEIL) సంస్థకు అప్పగించారు.
గ్రామాల పరిధిలోని లేఅవుట్‌లలో కీలక నిర్మాణ పనులు జరగనున్నాయి.. ముఖ్యంగా అంతర్గత, ప్రధాన రహదారుల నిర్మాణం, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు, తాగునీటి సరఫరా పైప్‌లైన్ నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థ, Sewage Treatment Plants (STP) నిర్మాణం, పునర్వినియోగ (Recycled) వాటర్ లైన్ ఏర్పాటు, అవెన్యూ ప్లాంటేషన్, గ్రీనరీ అభివృద్ధి.. విద్యుత్ & ICT కోసం యుటిలిటీ డక్ట్‌ల నిర్మాణం చేపట్టనున్నారు.. ఈ పనులన్నీ గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) సమకూర్చనుంది. టెండర్లు ఖరారు కావడంతో, పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ADCL మేనేజింగ్ డైరెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ల్యాండ్ పూలింగ్ గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా భూములిచ్చిన రైతులు, గ్రామాల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములిచ్చిన గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా, ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని దేశంలోనే ఒక ఆదర్శ అభివృద్ధి నమూనాగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.