AP CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లారు.
Also Read: Indian Cricket Team: భారత్ చేరుకున్న టీమిండియా.. అభిమానులకు ట్రోఫీ చూపెట్టిన రోహిత్ శర్మ!
బుధవారం రాత్రి టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశయ్యారు. పార్లమెంటు తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకొని.. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై ఆయన చర్చించారు. సీఎం ఈ పర్యటనలో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లి.. ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా సాయం కోరనున్నట్లు తెలిసింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయడం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పేదల ఇళ్లు, జల్‌జీవన్ మిషన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు సీఎం చేయనున్నట్లు సమాచారం. గురువారం ఉదయం 10.15 గంటలకు ప్రధానిని చంద్రబాబు కలుస్తారు.