Purandeshwari: బీజేపీ సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భం అందరూ చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సమసమాజం స్థాపనకు బీజేపీ పాటుపడుతుందన్నారు. మోడీ అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో రెండు, మూడు స్థానాలకు చేరుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి సహకారం అందించిందన్నారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయిందో చూస్తున్నామని ఆమె వెల్లడించారు. జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉందని.. బీజేపీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.
Also Read: CEO Vikas Raj: సైలెంట్ పీరియడ్ మొదలైంది.. ఈ 48 గంటలు చాలా కీలకం..
రాష్ట్ర పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పురంధేశ్వరి చెప్పారు. సామాజిక సాధికార యాత్ర చేయడానకి వైసీపీకి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించారు. ఎస్సీలకు చెందిన సుమారు 27 పథకాలు పక్కన పడేశారని.. దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి, సాధికార యాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే తెలీదన్నారు. ఎస్టీ మహిళను రాష్ట్ర పతి చేసిన ఘనత బీజేపీకే చెందుతుందన్నారు. పేదలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం దారి తప్పించి జగన్ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని.. జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. జిల్లాలో నదుల్లో ఉన్న ఇసుక అక్రమంగా దోచుకుంటున్నారని.. మైనింగ్ మాఫియా జిల్లాలో నడుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంతో పేదలకు న్యాయం జరగడం లేదు.. ఏ వర్గం బాగుపడలేదన్నారు. ఆరోగ్య శ్రీకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం అయుష్మాన్ భారత్ పెడితే దాన్ని బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.