AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని గవర్నర్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీలో గవర్నర్ తెలిపారు.
Read Also: Janasena-TDP: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు – పవన్ వరుస భేటీలు.. జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే?
స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించామని.. నాడు-నేడు పథకంలో భాగంగా స్కూల్ మెయింటనెన్స్ ఫండ్ అందిస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ధ పథకం ద్వారా 16 రకాల వంటకాలను మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు యూనిఫాం, బుక్స్ అందిస్తున్నామన్నారు. గోరుముద్ద పథకం కింద రూ.4,416 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విద్యాకానుక కింద రూ.3367 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 294 ప్రభుత్వ బడులను అప్‌గ్రేడ్ చేశామన్నారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9.5 లక్షల ట్యాబ్‌లు అందించామన్నారు. .. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి 20 వేలు అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. రూ.1,208 కోట్లతో 104, 108 వాహనాలు 1704 అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 36 లక్షల మందికి లబ్ధి చేకూరిందని గవర్నర్ తెలిపారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతులే రాష్ట్రానికి వెన్నెముక.. రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది.. వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 అందిస్తున్నామన్నారు.
చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానం
” 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.. పంట నష్టపోయిన రైతులకు అదే ఏడాది నష్టపరిహారం అందిస్తున్నాం.. 53.53 లక్షల మందికి రైతు భరోసా అందించాం.. రూ.33, 300 కోట్లు రైతు భరోసా కింద అందించాం.. 22.85 లక్షల మంది రైతులకు రూ.1,977 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించాం.. ఉద్యానపంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన తొలి రాష్ట్రం ఏపీ.. దేశంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే.. ఈ క్రాపింగ్ బుకింగ్ ద్వారా పంట విస్తీర్ణంపై డిజిటల్ రికార్డింగ్.. పంటల సేకరణకు రూ.7,751 కోట్లు కేటాయించాం.. దేశంలో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 15 శాతం ఉంది. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం అవతరించింది. మత్స్యకారుల కోసం వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం 10 వేలకు పెంచాం. 2.4 లక్షల మంది మత్స్యకార లబ్ధిదారులకు రూ.540 కోట్లు జమ చేశాం. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పది లక్షలకు పెంచాం. రూ.71 కోట్లతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అందించాం. 7.9 లక్షల స్వయం సహాయక బృందాలకు నాలుగేళ్లలో 25వేల కోట్ల లబ్ధి చేకూరింది. స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీలో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 లబ్ధిదారులకు అందించాం. కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు అందించాం. దిశ యాప్ కింద 3040 కేసులు నమోదయ్యాయి. ” అని గవర్నర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు.
31.19 లక్షల ఇళ్ల స్థలాలు మహిళలకు పంపిణీ చేసినట్లు గవర్నర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ స్థలాల్లో 22 లక్షల ఇళ్లను నిర్మించామన్నారు. లే అవుట్లలో మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. పింఛన్‌ను జనవరి నెల నుంచి రూ.3000కు పెంచామన్నారు. ఇప్పటివరకు పెన్షన్ల కింద రూ. 86, 692 కోట్లు అందించామన్నారు.
పోలవరం 74 శాతం పూర్తి..
‘పోలవరం 74 శాతం పూర్తైంది.. పెన్నా నదిపై సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశాం.. బ్రహ్మంసాగర్ ప్రాజెక్ట్ లీకేజీ సమస్యలను పరిష్కరించాం.. చిత్రావతి ప్రాజెక్ట్‌కు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేశాం. గండికోట ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం రూ.925 కోట్లు ఖర్చు చేశాం. వెలిగొండ ప్రాజెక్ట్‌లో మొదటి టన్నెల్ పనులను పూర్తి చేశాం. కుప్పం బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చేశాం. రూ.10 వేల కోట్లతో తాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేశాం. నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నాం. 19.41 లక్షల పంపుసెట్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నాం. విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.48,175కోట్లు అందించాం. ఇంధనరంగంలో రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయి. నాలుగు కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగవంతం చేశాం. 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇంటివద్దకే పాలన.’ వచ్చి చేరుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తమ ప్రసంగంలో చెప్పారు.