నేత కార్మికుల జీవితాలు గాల్లో దీపాలుగా మారాయి. ఉపాధి లేక.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఉరిపోసుకుంటున్నారు. అప్పుల్లో కూరుకుపోయి వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడుతోంది. తాజాగా మరో నేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కు చెందిన బత్తుల విఠల్ (54) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విఠల్ పవర్ లూమ్ రిపేర్ (జాఫర్)గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొంత కాలంగా సరైన ఉపాధి లేకపోవడంతో 3 లక్షల పైగా అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి విఠల్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని ధృవీకరించారు. మృతునికి భార్య శారద, కొడుకు, అనిల్ కూతురు భార్గవి ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.