Andhrapradesh: అటవీప్రాంతంలో నివసించే ప్రజలను కూడా సమాన భాగస్వాములను చేసినప్పుడే అడవుల పరిరక్షణ పటిష్టంగా జరుగుతుందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమూహాలు, ప్రభుత్వం ఉమ్మడి కృషి ఒక్కటే అడవుల పరిరక్షణకు ఏకైక పరిష్కారం అని ఆయన అన్నారు. ఈ విషయంలో గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న భాగస్వామ్య అటవీ యాజమాన్య విధానాన్ని(పీఎఫ్ఎం) యావత్తు దేశం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి అటవీ యాజమాన్య విధానం (జేఎఫ్‌ఎం), సామూహిక యాజమాన్య విధానం (సీఎఫ్‌ఎం) విధానాలను అనుసరించే ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్య అటవీ యాజమాన్య వ్యవస్థ కొనసాగుతోందని విజయసాయి రెడ్డి చెప్పారు.
Also Read: CM KCR: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
స్థానిక ప్రజలతో ఏర్పడిన వన సంరక్షణ సమితులే రాష్ట్రవ్యాప్తంగా అడవులకు సంరక్షకులు అయ్యాయి. భాగస్వామ్య అటవీ యాజమాన్య విధానం ఆంధ్రప్రదేశ్‌లో సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగస్వాములైన స్థానిక ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. అడవుల జీర్ణోద్దరణ గణనీయంగా జరుగుతోంది. పోడు వ్యవసాయం కోసం అడవుల నరికివేత తగ్గింది. అక్రమ కలప వ్యాపారం కోసం చెట్ల నరికివేత తగ్గింది. అటవీ ఉద్యోగుల భద్రత పెరిగిందని ఆయన వివరించారు. రాజ్యాంగపరంగా అడవులు రాష్ట్ర జాబితా కింద గుర్తించినా దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో క్రమేపీ అవి ఉమ్మడి జాబితా కిందకు చేరాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అడవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే సౌలభ్యం ఉంది. అయితే ఈ బిల్లులో పొందుపరచిన ఒక క్లాజ్ కింద అడవుల వినియోగం, అటవీ భూముల అసైన్‌మెంట్ వంటి అంశాలపై ఇకమీదట నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని పేర్కొనడం జరిగింది. అంటే ఇక మీదట ఏ ప్రైవేట్ సంస్థకైనా భూములు కేటాయించదలిచినపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై అటవీ శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. అడవులకు సంబంధించిన చట్టాల రూపకల్పన లేదా సవరణలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం విధిగా ఆయా రాష్ట్రాలను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.