Amit Shah: ప్రధాని నరేంద్ర మోడీ అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కొనసాగించిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వ్యాఖ్యలు ప్రధానమంత్రి పట్ల కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నాయకులకు ఉన్న ద్వేషం ద్వేషం, భయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. అవి పూర్తి విద్వేషపూరిత వ్యాఖ్యలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ద్వేషంతో తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి అనవసరంగా ప్రధాని మోడీని లాగారని అన్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే, తాను చనిపోనని, ప్రధాని మోడీని గద్దె దించేవరకు చనిపోనని అన్నారు.
Read Also: Tripura Crime: దారుణం.. కన్నతల్లిని చెట్టుకు కట్టేసి సజీవదహనం చేసిన కొడుకులు
ఖర్గే ఆరోగ్యంపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. “మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం విషయంలో మోడీజ జీ, నేను ప్రార్థిస్తున్నాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనమందరం ప్రార్థించాలి. ఆయన ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలి. 2047 నాటి వికసిత్ భారత్‌ను చూడాలి.” అని అమిత్ షా ఆకాంక్షించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గేకు ఆదివారం ప్రధాని మోడీ ఫోన్ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.