Ambulance Misuse: అత్యవసర పరిస్థితుల్లోనే అంబులెన్స్‌లు సైరన్ వాడాలనే నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక అంబులెన్స్ డ్రైవర్ తన పెంపుడు కుక్కకు ఆపరేషన్ కోసం సైరన్‌తో వెళ్లడం హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సైరన్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ క్రమంలో పంజాగుట్ట వద్ద అతి వేగంగా, సైరన్‌లు మోగిస్తూ వచ్చిన ఒక అంబులెన్స్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఓ అంబులెన్స్‌లో రోగి ఉన్నాడా లేడా అని పరిశీలించేందుకు పోలీసులు డోర్ తీసి చూడగానే అక్కడున్న దృశ్యానికి ట్రాఫిక్ పోలీసులు షాక్‌కు గురయ్యారు. అంతకుముందు అత్యవసర పరిస్థితి ఉందనుకున్న పోలీసులు.. ఆ అంబులెన్స్‌లో రోగి కాకుండా ఒక పెంపుడు కుక్కను తరలిస్తున్నారనే నిజం బయటపడింది.
Also Read: SLBC Tragedy: టన్నెల్‌లో భయానకమైన పరిస్థితి నెలకొంది: డిజి నాగిరెడ్డి
డ్రైవర్ ఇచ్చిన వివరాల ప్రకారం.. మియాపూర్ లోని ఆస్పత్రికి తన పెంపుడు కుక్కకు వాసెక్టమీ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ కోసం తీసుకెళ్తున్నానని చెప్పారు. అత్యవసరానికి సంబంధించిన అంబులెన్స్ సైరన్‌ను కేవలం కుక్కకు ఆపరేషన్ కోసం ఉపయోగించడం చట్టానికి విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, సైరన్ దుర్వినియోగం చేసినందుకు అంబులెన్స్ యజమాని మీద కేసు నమోదు చేశారు. అత్యవసర సేవలను ఇలా చెడుగా ఉపయోగించడం వల్ల నిజమైన రోగులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని అధికారులు హెచ్చరించారు.