Ambati Rambabu: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెట్టేసి తప్పుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర నుంచి 90,000 క్యూసెక్కుల నీరు బయటకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల , నిర్వహణ లోపం వల్ల ఈ వ్యవహారం జరిగిందని కొన్ని పార్టీలు వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. తుంగభద్ర ప్రాజెక్టు మూడు రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీతోపాటు, సీడబ్ల్యూసీ ఈ డ్యాంను పర్యవేక్షణ చేస్తున్నాయన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం దురదృష్టకరమన్నారు.
Read Also: Minister Anitha: క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదు.. మరి ఎప్పుడంటే?
ఈ రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మీద వేసి తప్పుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైయస్ జగన్ పాలన చేస్తున్నప్పుడు పులిచింతల గేటు కొట్టుకుపోతే 20 రోజుల్లో గేటు పెట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. గతంలో గుండ్లకమ్మ గేటు కూడా కొట్టుకుపోయిందని.. గతంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోవడానికి, చంద్రబాబు హయాంలో జరిగిన అలసత్వమే కారణమని అన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు పాలన సాగించారు.. చంద్రబాబు చాలా అనుభవం ఉన్న వ్యక్తి లాగా ప్రచారం చేసుకుంటాడని విమర్శలు గుప్పించారు.
పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించానని చంద్రబాబు చెప్తున్నాడని.. 75 ఏళ్ల వయసు ,14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఏమనాలి అంటూ వ్యాఖ్యానించారు. ఏ పని అడిగినా ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అమ్మ ఒడి ,తల్లికి వందనం లాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు దూరం అయ్యాయన్నారు. ప్రజలకు మోసపు మాటలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు దూరం అయిపోయాయన్నారు. సంపద సృష్టిస్తాను అని చెప్పే చంద్రబాబు రెండు మాసాల పాలన వైఫల్యం చెందిందని…రెండు నెలలు గడిచేలోపే,ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశాం రా బాబు అని ప్రజలు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.