దేశం కోసం, దేశ ప్రజలకు స్వేచ్ఛ కోసం అతి చిన్న వయస్సులోనే ప్రాణాలర్పించిన గొప్ప పోరాట స్ఫూర్తి ప్రధాత అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురష్కరించుకుని రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సభలో సోము వీర్రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద చిత్రపటాలకి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డితో కలిసి వీర్రాజు పూలమాల వేసి నివాళులర్పించారు.
Also Read: Pawan Kalyan: తండ్రీ తనయులు.. పవన్, అకీరా, శంకర్ పిక్ వైరల్!
అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని నివాళులర్పించారు. రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని విచారం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా చేసిన పోరాటం భారత స్వాతంత్య్ర పోరాటంలో గర్వించదగ్గ అధ్యాయమన్నారు. ఆయన దేశభక్తి, ధైర్యాన్ని యువతరం ఆదర్శంగా తెలుసుకోవాలన్నారు. కుల, వర్గ వివక్ష లేకుండా సమాజాన్ని ఏకం చేయడానికి స్వామి వివేకానంద చేసిన కృషిని సోము వీర్రాజు కొనియాడారు.