బండారు దత్తాత్రేయ అంటే తెలియనివారుండరు.. బీజేపీలో ఆయనది సుదీర్ఘ ప్రయాణం.. కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. కమలం పార్టీ ఆయన సేవలను గుర్తించి గవర్నర్‌ను కూడా చేసింది. ఇక, ఆయన ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్య కారణాలతో మరణించగా.. కూతురు అన్నీ తానై చూసుకుంటున్నారు. సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న దత్తన్న కూతురు బండారు విజయలక్ష్మి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. అన్ని పార్టీల్లోనూ దత్తాత్రేయకు మంచి మిత్రులు ఉన్నారు. వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుంది. అన్నింటికి మించి.. అలయ్ బలయ్ కార్యక్రమం బండారు దత్తాత్రేయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక, తన తండ్రి చేపట్టిన ఆ కార్యక్రమాన్ని భుజాలపై వేసుకున్న విజయలక్ష్మి.. వైభవంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు.. రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించి తనవైపు అందరి దృష్టి మళ్లెలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.
Read Also: Kejriwal: గత తొమ్మిదేళ్లుగా మౌనంగానే ఉన్నారు.. ప్రధానిపై కేజ్రీవాల్ ఆగ్రహం
బండారు విజయలక్ష్మి ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న ఆమె.. గతేడాది అలయ్ బలయ్ సందర్భంగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా విజయలక్ష్మి కటౌట్లు, ఫ్లెక్సీలు.. ఆ హడావిడి చూస్తే.. ఏదో రాజకీయ కార్యక్రమంగానే కనిపించింది. ఇక, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని.. రాజకీయాల్లో తనకు అవకాశం కల్పించే అంశంపై తుది నిర్ణయం బీజేపీదేనని అలయ్ బలయ్ వేదికగా చెప్పుకొచ్చారు విజయలక్ష్మి. అంతే కాదు.. బీజేపీ అధినాయకత్వం దృష్టిలో పడ్డారు .. పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె.. పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రల్లోనూ సందడి చేశారు. ఏదో మొక్కుబడిగా కాకుండా ఎక్కువ సమయం ఇచ్చి.. అందరితో కలుపుగోలుగా వ్యహరించారు .దత్తాత్రేయ కుమార్తె రాజకీయాల్లోకి వస్తే పార్టీకి కూడా కలిసివస్తుందని అనుకుంటున్నారట పార్టీ పెద్దలు.
Read Also: Santosh Sobhan : అమ్మో విసిగిపోయా.. పెళ్లి పై సంతోష్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక, బండారు విజయలక్ష్మి అభిమానులు ఆమెను ముషీరాబాద్ లేదా సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారట.. ముషీరాబాద్ అయినా ఓకే.. లేదా సనత్‌నగర్ సీటు అయినా ఆమెకు కేటాయించాలి.. దత్తన్న బిడ్డను దగ్గరుండి గెలిపించుకుంటామంటున్నారు ఆమె అభిమానులు.. మరో వైపు ఇన్ని అనుకూలతలు ఉన్నా తమ నాయకురాలికి టికెట్ రాకుండా కొంతమంది పార్టీ పెద్దలు అడ్డుపడుతున్నారని మండిపడుతున్నారు పార్టీ కార్యకర్తలు.. ఇక, ఈ పరిణామాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇతర పార్టీలు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం.. విజయలక్ష్మికి అధికార బీఆర్ఎస్‌తో పాటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇతర పొలిటికల్ పార్టీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని ఆమె అనుచరులు చెబుతున్నమాట.. ఈ మధ్య ఆమె పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కూడా కలిసిన ఆమె రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారట.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ రేవంత్‌రెడ్డి ఆమెను ఆహ్వానించారనే చర్చ సాగుతోంది.. బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెతో టచ్‌లోకి వెళ్లారట.. ఒక వేళ బీజేపీలో టికెట్ దక్కని పక్షంలో.. మా పార్టీలో చేరండి.. మేం టికెట్ ఇస్తామని ఇతర పార్టీల నుంచి బండారు విజయలక్ష్మికి ఆఫర్లు వస్తున్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నమాట.