పల్నాడులో నేటి నుండి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ చేయనున్నట్లు తెలిపారు పోలీసులు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కౌంటింగ్ డే రోజు నరసరావుపేటను, అష్టదిగ్బంధం చేయనున్నారు పోలీసులు.. జూన్ 4న కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించే ముందు రాజకీయ అభ్యర్థులందరి ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహిస్తామని.. పాజిటివ్ వచ్చిన వారిని హాల్లోకి అనుమతించబోమని పల్నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మాలిక గార్గ్ హెచ్చరించారు. జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలో ముందుగా నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా ఎన్నికల ఏజెంట్లు జూన్ 3న మద్యానికి దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కేంద్రం దగ్గర మద్యం పరీక్షల కోసం పోలీసులు కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మూడు వేల మంది పోలీస్ ల తో పల్నాడు లో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాడ్జిలు, కళ్యాణ మండపాలను సైతం మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ సందర్భంగా పలనాడు జిల్లాలో పోలీసుల భారీ పహారా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డిఎస్పీల మఖాం వేయనున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతర పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని , ఈసీ కఠిన ఆదేశాలతో మరింత అప్రమత్తమయ్యారు పల్నాడు పోలీసులు.. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈరోజు నుండి 5వ తేదీ సాయంత్రం వరకు వాణిజ్య వ్యాపార కలాపాలు పూర్తిగా బంద్ చేయనున్నట్లు.. కౌంటింగ్ సమయంలో చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా , రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.