Crime News: తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిని మించి ఎవరూ లేరని అర్ధం. నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోడానికే మనసు దీనికి ఒప్పుకోదు. అలాంటిది ఓ కిరాతక కొడుకు తల్లిని దారుణంగా చంపాడు. రక్తపుమడుగులో ఆ తల్లి విలవిలలాడుతూ ప్రాణాలను కోల్పోయింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో తల్లిని దారుణంగా కొట్టి హత్య చేశాడు ఆ కసాయి కొడుకు. చంపిన అనంతరం ఆ తల్లి నాలుక కోసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు ఆ దుర్మార్గుడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Also Read: Uttar Pradesh: నాలుగేళ్ల బాలికపై హత్యాచారం.. మృతదేహాన్ని కొరుక్కు తిన్న కుక్కల గుంపు
విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన రవణమ్మకు శ్రీనివాసరావు అనే కుమారుడు ఉన్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం పీకల వరకు తాగి ఇంటికి వచ్చాడు. మద్యం తాగి తూలుతూ వచ్చిన కొడుకును రవణమ్మ తీవ్రంగా మందలించింది. కొద్దిసేపు తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో శ్రీనివాస తన తల్లిపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. తల్లి కిరాతకంగా హత్య చేసి ఆమె నాలుకను కోసి దానిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.