ఓ వైపు బీహార్ సంక్షోభం కాకరేపుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటన ఇండియా కూటమిలో మరో గందరగోళం సృష్టించేటట్లుగానే కనిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అఖిలేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది.
సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి డీల్ కుదరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. అఖిలేష్ యాదవ్, అశోక్ గెహ్లాట్ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇరు పార్టీల మధ్య చర్చలు ముగిసిన తర్వాతే ఫార్ములా ఏమిటనేది చెప్పగలమని జైరాం రమేష్ తేల్చిచెప్పారు. ఇక సీట్ల షేరింగ్‌పై తనకు ఎలాంటి సమాచారం లేదని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడించారు. సీట్ల పంపకాలపై సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
Gyanvapi Mosque: జ్ఞానవాపిని హిందువులకు అప్పగించండి.. ఏఎస్ఐ నివేదిక తర్వాత వీహెచ్‌పీ..
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రీయ లోక్ దళ్ (RLD)తో ఇప్పటికే సీట్ల పంపకాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఖరారు చేసింది. ఆ ప్రకారం ఆర్ఎల్‌డీ 7 సీట్లలో పోటీ చేయనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 5 సీట్లు, కాంగ్రెస్-2, ఆర్ఎల్‌డీ ఒక సీటు గెలుచుకున్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమితో పొత్తు లేదని ఇప్పటికే మమతాబెనర్జీ ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీకి పలు ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ వాటిని తోసిపుచ్చినందున ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. ఇదే మాదిరిగా పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి కాస్తా ఒక్కొక్కరిగా దూరమైపోతున్నారు. ఈ గందరగోళానికి ముగింపు ఉంటుందో.. లేదో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.