Air India: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధంగా మారింది. ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 40 మంది ఇజ్రాయిలీలు మరణించారు. చాలా మందిని హమాస్ బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను టార్గెట్ చేస్తోంది. తాము యుద్ధంలో ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ప్రకటించారు.
Read Also: Israel: ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా పట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు.. వైరలవుతున్న వీడియోలు..
ఇజ్రాయిల్‌కి ప్రపంచదేశాలు అండగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ అండగా ఉంటామని అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్‌కి వెళ్లే విమానాలను పలు దేశాలు రద్దు చేసుకుంటున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఇజ్రాయిల్ వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. యుద్ధ పరిస్థితులు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7, 2023 ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లే AI139, టెల్ అవీవ్ నుంచి న్యూఢిల్లీ వచ్చే AI140 విమానాన్ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరికొన్ని అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా తమ విమానాలను రద్దు చేసుకుంటున్నాయి. జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శనివారం ఇజ్రాయిల్ వెళ్లే విమానాలనున రద్దు చేసినట్లు ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం ఇజ్రాయిల్ లో ఉన్న భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. సురక్షిత ప్రదేశాలకు పరిమితమవ్వాలని, కదలికను తగ్గించాలని సూచించింది.