ఏపీలో నాలుగు జిల్లాలను నిండా ముంచాయి వానలు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తినష్టం కల్గించాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయ్. ఇవాళ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.పది రోజుల నుంచి ఒకటే వర్షాలు. పట్టిన ముసురు తొలగలేదు. ఒకదాని తర్వాత ఒకటి వరసగా మూడు వాయు గుండాలు..తీరని నష్టాన్ని మిగిల్చాయ్. నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలో కురుస్తున్న వర్షాలతో మూడు జిల్లాలు తలకిందులయ్యాయి.
భారీ కుంభవృష్టి, వరదలతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు అల్లాడుతున్నాయి. వరదలతో ప్రభుత్వం అలర్టయ్యింది. ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వరద పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఏరియల్ సర్వే తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు సీఎం.ఇటు ఏపీలోని వరద పరిస్థితులపై సీఎంతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించారు సీఎం జగన్. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు మోడీ.