Adam Gilchrist: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన కెరీర్‌పై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచుల్లో ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులే చేయగలిగాడు. ఈ కారణంగా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని పలువురు మాజీ క్రికెటర్లు సైతం సూచించారు. తన చివరి 14 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలగడంతో, దేశవాళీ క్రికెట్ ఆడుతూ తన ఫామ్‌ను తిరిగి పొందాలని అనేక మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో గిల్‌క్రిస్ట్ ఓ పోడ్‌కాస్ట్‌లో హర్షా భోగ్లేతో కలిసి రోహిత్ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: RK Roja: తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి..
ఇందులో భాగంగా గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంలో ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదని, ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాడని తెలిపాడు. తన కొడుకుతో సమయం గడిపి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలిపాడు. అలాగే రోహిత్ కొడుకు డైపర్లు మార్చుకోవడమే మిగిలిందని కాస్త ఎక్కువగానే మాట్లాడాడు.
అలాగే, రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు విరాట్ కోహ్లీ చేపడతారని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ సారథ్యం జట్టుకు మరింత బలం చేకూర్చుతుందని పేర్కొన్నాడు. బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా, గాయాలతో అర్ధాంతరంగా జట్టుకు దూరమయ్యాడని, చివరికి కోహ్లీ నాయకత్వాన్ని అందుకుని జట్టును నడిపించాడని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ లోకంలో చర్చనీయాంశంగా మారాయి. చూడాలి మరి రోహిత్ శర్మ భవిష్యత్తు టెస్ట్ ఫార్మాట్‌లో ఎలా ఉండబోతుందో.