కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సీబీఐకి కాళేశ్వరం అంశాన్ని అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం. ఎలాంటి పక్షపాతం లేకుండా సీబీఐకి అప్పగించడం అంటే పారదర్శకంగా ఉన్నామని సందేశం ఇవ్వడం. గతంలో సీబీఐకి అప్పగించాలని బీజేపీ సూచించింది. కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే మా మాట నిజం అయ్యింది. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయల దొరకడం అంటే ఏమిటి?. మాజీ మంత్రులు నిన్న హరీష్ రావు, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ సభ్యులు బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందో అందరూ చూశారు. బీజేపీ ఐడియాలజీని మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విమర్శిస్తుంది. ఈ రెండు పార్టీలు విరుద్ధ భావజాలం కలిగినవి.. ఎప్పుడూ కలవలేదు’ అని అన్నారు.
‘గతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తామని చెప్పాం. కేంద్ర సంస్థగా ఉన్న సీబీఐకి అప్పగించాం. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థలకు ఇస్తే.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని ఆరోపిస్తారు. అందుకే కేంద్ర సంస్థకు అప్పగించడం జరిగింది. సీబీఐని గతంలో ఆయా అంశాలపై విమర్శించాం. కానీ కాళేశ్వరం అంశం ప్రత్యేక అంశంగా పరిగణించడం జరిగింది. మేము విమర్శలకు తావు లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాం. పారదర్శకంగా ఈ విచారణ జరగాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో అమిత్ షా, మోడీలు కూడా కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని కేసీఆర్ సంపాదించారని అన్నారు. కేసీఆర్ కుట్ర కోణంతో ఇదంతా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఈ కుంభకోణాన్ని వెలికి తీసేందుకు ఈ విచారణ జరుగుతుందని నమ్ముతున్నాం’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.