సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మనీలాండరింగ్ కేసును ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సమన్లు జారీ చేసినా కూడా నిందితుడిని అరెస్టు చేయాలంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ 19 కింద ఈడీకి ఇచ్చిన అరెస్టు అధికారాలను సుప్రీంకోర్టు స్వల్పంగా తగ్గించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత, ఈడీ అధికారులు సెక్షన్ 19 కింద నిందితుడిగా చేసిన వ్యక్తిని అరెస్టు చేయలేరని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ నిందితులను కస్టడీలోకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ప్రత్యేక కోర్టు సమన్లకు హాజరైన నిందితులను అరెస్టు చేసేందుకు పీఎంఎల్‌ఏలోని సెక్షన్ 19 కింద ప్రత్యేక అధికారాలను ఈడీ ఉపయోగించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
READ MORE: Haryana : భక్తులతో వెళ్తున్న బస్సులో మంటలు.. ఎనిమిది మంది సజీవ దహనం
‘ఈడీ ఫిర్యాదును దాఖలు చేసే వరకు నిందితులను అరెస్టు చేయని కేసుల్లో, ఆ తర్వాత కూడా వారిని అరెస్టు చేయకూడదు. ముందుగా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సమన్లు జారీ చేస్తుంది. ఆ సమన్లకు నిందితులు స్పందించి కోర్టులో హాజరైతే వారు కస్టడీలో ఉన్నట్లు పరిగణించకూడదు. ఒకవేళ సదరు వ్యక్తి ప్రత్యేక కోర్టుకు సమాధానం ఇచ్చిన తర్వాత అతడిని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే.. దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని విశ్వసిస్తే విచారణకు అనుమతిస్తుంది’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిందితుడు కోర్టు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైతే మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 70 కింద అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అది కూడా బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయి ఉండాలని తెలిపింది.