మధ్యప్రదేశ్‌లోని రేవాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సమోసాలో బల్లి కనిపించడంతో ఇక్కడ కలకలం రేగింది. దీంతో ఐదేళ్ల చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. నిజానికి.. సమోసా తిన్న తర్వాత రేవాలోని 5 ఏళ్ల చిన్నారికి వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారి కుటుంబం హోటల్ యజమానిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Seaplane: శ్రీశైలంలో సేఫ్‌గా ల్యాండ్ అయిన సీ ప్లేన్.. ట్రయల్ రన్ విజయవంతం..
చిన్నారి తిన్న సమోసాలో బల్లి ఉందని, అది తిన్న తర్వాత చిన్నారి అస్వస్థతకు గురైందని చెబుతున్నారు. గురువారం రాత్రి రేవా సివిల్‌లైన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దీనదయాళ్ ధామ్ పద్రాలో రోడ్డుపక్కనున్న హోటల్‌లో బంగాళదుంప సమోసా తిన్న చిన్నారి పరిస్థితి విషమించింది. దీంతో అనుమానం వచ్చి సమోసాను పరీక్షించడగా.. బల్లి కనిపించింది. చికిత్స నిమిత్తం రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్చగా.. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఘటన జరిగిన హోటల్‌లో ప్రతిరోజూ జనం రద్దీగా ఉంటారు. హోటల్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకులకు తెలియజేశామని, అయితే ఆ తర్వాత కూడా హోటల్‌లో ఇలాంటి విషపూరితమైన ఆహార పదార్థాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారని పిల్లల కుటుంబ సభ్యులు తెలిపారు. బల్లి తల మొత్తం సమోసా లోపల ఉండగా సగం బల్లి చిన్నారి శరీరంలోకి వెళ్లిపోయిందని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.