లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రాలో ఓ జవాన్ మోసానికి పాల్పడ్డాడు. డబ్బులు ఇస్తే ఈవీఎంను సెట్ చేస్తా అంటూ ఓ రాజకీయ నాయకుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతి ధక్నే అనే వ్యక్తి భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు పుణెలో మహారాష్ట్ర శాసనసమండలిలో ప్రతిపక్ష నేత, శివసేన (యూబీటీ) నాయకుడు అంబాదాస్ దన్వేను కలిశాడు. నిర్దిష్ట అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా చిప్‌ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని, అందుకు తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.2.5 కోట్లు ఇవ్వాలని కోరారు.
READ MORE: Kalki 2898 AD : “కల్కి” కోసం రంగంలోకి సూపర్ స్టార్.. నాగ్ అశ్విన్ ప్లాన్ మాములుగా లేదుగా..
జవాన్ పై అనుమానం వ్యక్తం చేసిన దన్వే అతడి గురించి పోలీసులకు సమాచారమిచ్చాడు. నిందితుడిని ఆధారాలతో పట్టించేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. మంగళవారం సాయంత్రం దన్వే సోదరుడు రాజేంద్ర.. నిందితుడిని ఓ హోటల్‌కు పిలిపించాడు. అక్కడ రూ.1.5కోట్లకు డీల్ పూర్తి చేసుకున్నట్లు అతడిని నమ్మించి టోకెన్ కింద రూ.లక్ష ఇచ్చాడు. దన్వే ఇచ్చిన సమాచారంతో అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అక్కడే పట్టుకున్నారు. ‘నిందితుడికి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు ఇలా అడ్డదారిలో మోసాలకు పాల్పడేందుకు యత్నించాడు. అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నాం.’ అని పోలీసులు వెల్లడించారు. అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే.. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో ఆర్మీ (Army) బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఈవీఎంల (EVM)పై అనేక సందేహాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈవీఎం ఓట్లతో 100శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని, లేదా బ్యాలెట్ బాక్సులను ఉపయోగించాలని సుప్రీంలో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇప్పుడు ఈ అంశం బయటకు రావడంతో ఈవీఎంలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.