మధ్యప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల జరిగిన మూడో దశ పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. ఆ బాలుడు స్థానిక బీజేపీ నేత వినయ్ మెహర్ కుమారుడని గుర్తించారు. మంగళవారం వినయ్ మెహర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కుమారుడితో కలసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కుమారుడిని పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లాడు. ఆయన తనకు బదులుగా కుమారుడు ఈవీఎంపై బీజేపీకి ఓటు వేశారు. ఈ తతంగాన్నంతా తన ఫోన్‌లో రికార్డు చేశారు.. వినయ్. ఈ 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.
READ MORE: Akshaya Tritiya 2024: నేడు ‘అక్షయ తృతీయ’.. బంగారం కొనడానికి అనుకూల సమయం ఇదే!
ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘బీజేపీ.. ఎన్నికల కమిషన్‌ను పిల్లల ఆట వస్తువుగా మార్చేసింది. బీజేపీ నేత వినయ్ మెహర్ తన ఓటును కుమారుడితో వేయించారు. దీన్ని ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలోనూ పెట్టారు. అసలు పిల్లలను, మొబైల్‌ను పోలింగ్ బూత్‌లోకి ఎలా అనుమతించారు? దీనిపై ఏమైనా చర్యలుంటాయా?’ అని ఎక్స్ వేదికగా.. ప్రశ్నించారు. అయితే ఈ వీడియోపై ఎన్నికల సంఘం ఇంకా స్పందించలేదు. జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈనేపథ్యంలోనే ప్రిసైడింగ్ అధికారి సందీప్ సైనీపై వేటు పడింది. అతడిని సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ నేత వినయ్ మెహర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల సంఘం త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచిస్తున్నారు.