డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకం దారుగా మారిన 24 సంవత్సరాల లీలా కృష్ణ అనే యువకుడు.. ఎవరికి ఏ రకమైన డ్రగ్ కావాలన్నా సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన లీలా కృష్ణ గురువారం నాలుగోసారి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ టీ ఎఫ్ సీఐ నాగరాజు బృందం ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. బ్యాగులో డ్రగ్స్ ను పెట్టుకొని అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎక్సైజ్ పోలీసులు లీలా కృష్ణను పట్టుకున్నారు. అతని బ్యాగులో తనిఖీలు నిర్వహించగా 17.07 ఓజీ కుష్ గంజాయి, 2.34. గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 2 ఎల్ ఎస్ డి బ్లాస్ట్,220 గ్రాముల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన డ్రగ్స్ గంజాయి విలువ రూ.1.40 లక్షలు గా ఉంటుందని సీఐ తెలిపారు.
READ MORE: Vijaysai Reddy: మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు!
ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు పట్టుబడిన లీలా కృష్ణ 2022,2023 లో ఎస్ఓటి పోలీసులకు పట్టుబడ్డాడు. 2024 మేలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు పట్టుబడ్డాడు. మూడుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా కూడా తన అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేదు. గోవాలోని అంజనా బీచ్ లో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపారి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి హైదరాబాదుకు తీసుకువచ్చి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందరికీ అమ్ముతుంటాడు. తండ్రి బియ్యం వ్యాపారం చేస్తుంటే కొడుకు మాత్రం డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. లీలా కృష్ణను పట్టుకున్న టీంలో సీఐ నాగరాజు తో పాటు ఎస్సై జ్యోతి, హెడ్ కానిస్టేబుల్ అన్వర్ లేక సింగ్, కానిస్టేబుల్ రాజేశ్వర్ వికాస్ శశి చంద్రశేఖర్ ఉన్నారు. అన్ని రకాల డ్రగ్స్ ను అమ్మకాలు జరిపే నొటోరియల్ క్రిమినల్ లీలా కృష్ణను పట్టుకున్న టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.