Bihar Road Accident Today: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తెల్లవారుజామున రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖిసరాయ్ సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న టెంపోను రాంగ్ సైడ్ నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టెంపో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ సికంద్రాలో క్యాటరింగ్ పని ముగించుకుని.. ఇంటికి వెళ్లేందుకు లఖిసరాయ్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. ఇంతలో ఎన్‌హెచ్ 30పై వేగంగా వచ్చిన లారీ.. టెంపోను ఢీకొట్టింది. మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బంధువులు వచ్చిన తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు.