Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోని భావ్‌సా గ్రామంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ కోతులను కాపాడేందుకు అటవీ శాఖ, జలవనరుల శాఖ సంయుక్తంగా ఓ వంతెన నిర్మించారు. నెలల తరబడి చెట్టుపైనే ఉండిపోయిన కోతులను రక్షించేందుకు ఆ శాఖ తాడు, మొద్దుల సాయంతో వంతెనను నిర్మించారు. అక్కడ స్థానిక డ్యాం ఒక్కసారిగా నిండిపోవడంతో ఆ ప్రాంతంలోని కోతులు చెట్లపైకి ఎక్కి నెలల తరబడి చెట్లపైనే ఉన్నాయి. ఈ సమయంలో చాలా కోతులు ఆకలితో చనిపోయాయి.
భావసా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి.. భూమిలోని నీటి మట్టాన్ని పెంచడానికి శాఖ ద్వారా ఆనకట్ట నిర్మించబడింది. అయితే అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా డ్యాం పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఇక్కడి చింతచెట్లపై 50 నుంచి 60 కోతులు చిక్కుకుపోయాయి. గ్రామస్తులు జలవనరుల శాఖ, అటవీశాఖ అధికారులకు పలుమార్లు సమాచారం అందించారు. అయితే దీనిపై ఆ శాఖ ఏమాత్రం పట్టించుకోలేదు. చింతచెట్టు ఆకులు, పండ్లు, బెరడు తిని కోతులు కొన్ని నెలల నుంచి బతుకుతున్నాయి.
Read Also:Divyavani: కాంగ్రెస్ గూటికి దివ్యవాణి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఠాక్రే
ఇప్పుడు చెట్టు ఆకులు మొత్తం అయిపోవడంతో 50కి పైగా కోతులు ఆకలితో చనిపోయాయి. కొన్ని కోతులు నీటిలో నుంచి ఈత కొట్టేందుకు ప్రయత్నించి మునిగి చనిపోయాయి. ఇప్పుడు ఇక్కడ నాలుగైదు కోతులు మాత్రమే సజీవంగా ఉన్నాయి. అవి కూడా చాలా బలహీనంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అటవీశాఖ, జలవనరుల శాఖ కాపాడకపోతే అవి కూడా చనిపోతాయి. సరైన సమయంలో చర్యలు తీసుకుని ఉంటే కోతుల ప్రాణాలు కాపాడి ఉండేవారు. కోతులు వన్యప్రాణుల రక్షణలోకి వస్తాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెలుగులోకి తేవడంతో యుద్ధ ప్రాతిపదికన కోతులను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇక్కడ అటవీశాఖ సిబ్బంది కలప, తాడుతో వంతెనను నిర్మించి కోతులకు ఆహార ఏర్పాట్లు కూడా చేశారు.
కోతులను రక్షించేందుకు అటవీశాఖ సిబ్బంది కలప, తాడుతో వంతెనను నిర్మించినట్లు అటవీశాఖ ఎస్డీఓ అజయ్ సాగర్ తెలిపారు. ఈ వంతెన సహాయంతో కోతులు డ్యామ్ దాటి సురక్షిత ప్రదేశానికి చేరుకుంటాయి. కోతులకు ఆహార ఏర్పాట్లు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు. కోతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా చూసుకుంటున్నారు. వాటిని కాపాడేందుకు అటవీశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
Read Also:Vizag Road Accident: స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ.. రోడ్డుపై పల్టీలు కొట్టింది..!