పాకిస్థాన్ (Pakistan), ఆప్ఘనిస్థాన్‌ను భారీ హిమపాతం (Snowfall) ప్రజలను హడలెత్తించింది. ఇటీవల కురిసిన మంచు.. వడగళ్ల వానతో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను కోల్పోయారు. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 36 మంది మృతిచెందగా.. 43 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఇటీవల పాకిస్థాన్(Pakistan)లో భారీగా హిమపాతం కురిసింది. అదే సమయంలో వడగళ్ల వాన పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 36కి చేరింది. మరో 43 మంది గాయపడ్డారని ఆ దేశ మీడియా పేర్కొంది. మృతుల్లో 22 మంది వరకు చిన్నారులున్నారు. చాలామంది మంచుపెళ్లల కింద చిక్కుకుపోయి చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
మార్చిలో పాక్ పశ్చిమ, ఉత్తర భాగాల్లో వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. పర్యావరణ మార్పుల్లో భాగంగానే ఇలా జరిగినట్లు వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ ముస్తాక్ అలీషా వెల్లడించారు.
గత 25 ఏళ్లలో ఖైబర్ ప్రాంతంలో ఒక్కసారి మాత్రమే హిమపాతం చూశామని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వడగళ్ల వాన కారణంగా ఖైబర్, బలోచిస్థాన్ ప్రావిన్సుల్లో 150 ఇళ్లు ధ్వంసం కాగా.. దాదాపు 500 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ కొన్ని జిల్లాలకు విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది.
ఇక అఫ్టనిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ 39 మంది మరణించగా.. మరో 30 మంది గాయపడినట్లు సమాచారం. దీనిపై అక్కడి విపత్తు ప్రతిస్పందన నిర్వహణశాఖ ప్రతినిధి జనాన్ సయిక్ మాట్లాడుతూ 637 ఇళ్లు కూలిపోగా.. 14,000 పశువులు మరణించాయన్నారు.
